ఇంటర్నెట్ డెస్క్: విమానంలో సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి విమాన సిబ్బంది తగిన బుద్ధి చెప్పారు. ఆ యువకుడి దుందుడుకుతనాన్ని భరించలేని సిబ్బంది అతడిని సీటుకే కట్టేసి నోటికి ప్లాస్టర్ వేశారు. విమానం ల్యాండ్ అయ్యాక అతడిని పోలీసులకు అప్పగించారు. ఫిలడెల్ఫియా నుంచి మియామీ వెళుతున్న విమానంలో మాక్స్‌వెల్ బెర్రీ (22) అనే అమెరికా యువకుడు మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించాడు. తాకరాని చోట తాకి వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు. తోటి ప్రయాణికులతో మాటల యుద్ధానికి దిగాడు. ఇదేంటని ప్రశ్నించిన సిబ్బందిపై దాడికి దిగాడు.
దీంతో విసుగు చెందిన విమాన సిబ్బంది సదరు యువకుడిని దొరకబుచ్చుకొని అతడు కూర్చున్న సీట్లోనే అతడిని టేప్ సాయంతో కట్టేశారు. మాట్లాడకుండా నోటికి కూడా టేప్ చుట్టారు. ఆ యువకుడిని కట్టేస్తుంటే తోటి ప్రయాణికులంతా నవ్వుతూ ఆనందం వ్యక్తం చేశాడంటే అతగాడు ఎంతటి గలాటా సృష్టించాడో అర్థమవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలకు కొందరు తమ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఇందుకు సంబంధించిన రెండు వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తోటి ప్రయాణికుల పట్ల యువకుడు అరవడం, సిబ్బందిపై దాడికి సంబంధించిన ట్విటర్ వీడియోను ఇప్పటివరకు 12.7 మిలియన్లకుపైగా వీక్షించారు. విమానం ల్యాండ్ అవుతుండగా సీట్లో కట్టేసి ఉన్న అతడు ‘నన్ను కాపాడండి’ అంటూ అరుస్తున్న మరో వీడియోకు 3.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు నిందితుడికి తగిన బుద్ధి చెప్పారని కామెంట్లు పెడుతున్నారు.