వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రియల్ ఎస్టేట్ దిగ్గజం డొనాల్డ్ ట్రంప్ ఫోర్బ్స్ అత్యంత సంపన్నుల జాబితాలో (ఫోర్బ్స్-400) స్థానం కోల్పోయారు. ఏటా ఫోర్బ్స్ అత్యంత సంపన్నుల జాబితాను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అయితే, గడిచిన 25 ఏళ్లలో తొలిసారి ఆయనకు ఈ జాబితాలో చోటు దక్కకపోవడం గమనార్హం. ఈసారి ట్రంప్ నికర సంపద 600 మిలియన్ డాలర్లు తగ్గిందని ఫోర్బ్స్ తెలిపింది. ప్రస్తుతం ఆయన సంపద విలువ 250 మిలియన్ డాలర్లు మాత్రమే. ఈ జాబితాలో చోటు దక్కాలంటే సుమారు 400 మిలియన్ల డాలర్ల సంపద అవసరం ఉంది. గతేడాది ట్రంప్ ఫోర్స్బ్ అత్యంత సంపన్నుల జాబితాలో 339వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.
2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచాక రియల్ ఎస్టేట్ ఆస్తులను వికేంద్రీకరించాలని ఫెడరల్ ఎథిక్స్ అధికారులు ట్రంప్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ, ట్రంప్ వాటిని అంటిపెట్టుకునేందుకే మొగ్గు చూపారు. ఆయన అలా చేసి ఉండకపోతే విస్తృత ఆదాయాన్నిచ్చే ఫండ్లలో పెట్టుబడి పెట్టే అవకాశం లభించేది. ఒకవేళ అలా చేయకుండా ఉంటే రుణభారం పోను 3.5 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను ట్రంప్ కలిగి ఉండేవారు. మొత్తంగా తన ఆస్తులు కరిగిపోవడానికి స్వయంగా ట్రంపే కారణమని ఫోర్బ్స్ అభిప్రాయపడింది. ఇదిలా ఉండగా ఫోర్బ్స్ జాబితాలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అగ్రస్థానంలో నిలువగా.. టెస్లా, స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ రెండో స్థానాన్ని దక్కించుకున్నారు.