Home Mondo ప్రపంచంలో అత్యంత నివాసయోగ్యమైన నగరమిదే..

ప్రపంచంలో అత్యంత నివాసయోగ్యమైన నగరమిదే..

0
ప్రపంచంలో అత్యంత నివాసయోగ్యమైన నగరమిదే..

కరోనాతో తారుమారైన నగరాల జాబితా

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన విలయతాండం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నగరాల్ని మహమ్మారి ఓ కుదుపు కుదిపేసింది. ఆర్థిక వ్యవస్థల్ని ఛిన్నాభిన్నం చేయడంతో పాటు వ్యాపారాలను కుంగదీసింది. తాజాగా నగరాల నివాసయోగ్యతను సైతం తారుమారు చేసినట్లు ‘ది ఎకానమిస్ట్‌’ వార్షిక సర్వే వెల్లడించింది. కరోనా దెబ్బకు ఐరోపా దేశాల్లోని నగరాలు చిగురుటాకుల్లా వణికిన విషయం తెలిసిందే. దీంతో అవి వాటి నివాసయోగ్యతను కోల్పోయినట్లు సర్వే తెలిపింది. ప్రతిసారీ అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితాలో ముందుండే ఐరోపా నగరాలన్నీ ఈసారి తమ స్థానాల్ని కోల్పోయాయి.

ఈ జాబితాలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, జపాన్‌లోని మహానగరాలు ముందున్నాయి. కరోనా కట్టడిలో విజయవంతమైన న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌ నగరం ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలిచింది. ఇక జపాన్‌లోని ఒసాకా, ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్‌, మెల్‌బోర్న్‌, బ్రిస్బేన్‌, పెర్త్‌  న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్‌,  జపాన్‌లోని టోక్యో,  స్విట్జర్లాండ్‌లోని జెనీవా జాబితాలో తొలి పదిస్థానాల్లో నిలిచాయి. పదింటిలో ఆరు ఆస్ట్రేలియాలోని నగరాలే కావడం విశేషం. కరోనా కట్టడిలో న్యూజిలాండ్‌ సహా ఆస్ట్రేలియా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రపంచంలో అతితక్కువ కేసులు, మరణాలు నమోదైన దేశాల్లో ఇవి ముందున్నాయి.

2018-20 మధ్య ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా ఉన్న వియన్నా ఈసారి ఏకంగా 12వ స్థానానికి పడిపోయింది. జాబితాలో తమ స్థానాన్ని ఈసారి భారీగా దిగజార్చుకున్న 10 నగరాల్లో 8 ఐరోపాకు చెందినవే కావడం గమనార్హం. జర్మనీలోని పోర్ట్‌ సిటీ అయిన హాంబర్గ్‌ ఏకంగా 34 స్థానాలు దిగజారి 47వ ర్యాంక్‌కి పడిపోయింది.

కరోనా మహమ్మారి మూలంగా ఐరోపా దేశాల ఆరోగ్య సంరక్షణా వ్యవస్థలు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్న విషయం తెలిసిందే. నివాసయోగ్య నగరాల జాబితాను సిద్ధం చేసే సమయంలో పరిగణనలోకి తీసుకునే అంశాల్లో ఆరోగ్య వ్యవస్థల పనితీరు కూడా ఒకటి. ఈ నేపథ్యంలోనే ఐరోపా నగరాల స్థానాలు గల్లంతయ్యాయి. ఇక అమెరికాలో కరోనా కట్టడితో పాటు వ్యాక్సినేషన్‌లో ముందున్న హవాయ్‌లోని హొనొలులు ఏకంగా 46 స్థానాలు ఎగబాకి 14వ స్థానానికి చేరడం విశేషం. ఇక నివసించడానికి ఏమాత్రం అనువు కాని నగరాల్లో  సిరియాలోని డమాస్కస్‌ తొలి స్థానంలో నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here