బిట్‌కాయిన్ మైనింగ్ వల్ల ఏటా ఉత్పత్తయ్యే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు(ఈ-వ్యర్థాలు), నెదర్లాండ్స్‌లో వార్షికంగా ఉత్పత్తి అయ్యే ఎలక్ట్రానిక్ వ్యర్థాలకు సమానమని ఓ అధ్యయనంలో తేలింది.
డేటా సైంటిస్టులు అలెక్స్ డీ వ్రైస్, క్రిస్టియన్ స్టోల్ అంచనాల ప్రకారం ప్రతి సంవత్సరం క్రిప్టోకరెన్సీ మైనర్లు 30,700 టన్నుల ఈ-వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నారు. సగటున ఒక లావాదేవీకి 272 గ్రాముల ఈ–వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయని వారు చెప్పారు. ఇది ఐఫోన్–13 బరువు 173 గ్రాములు కంటే ఎక్కువ. బిట్‌కాయిన్ మైనర్లు కొత్త బిట్‌కాయిన్‌లను సృష్టించడం ద్వారా డబ్బు సంపాదిస్తారు. కానీ ఈ మైనింగ్‌కి వాడే కంప్యూటర్లు భారీ మొత్తంలో శక్తిని వినియోగిస్తాయి.
వారు ఈ డిజిటల్ కరెన్సీని సంపాదించడానికి, బిట్‌కాయిన్ లావాదేవీలను ఆడిట్ చేస్తారు. ఫిలిప్పీన్స్ దేశం ఏడాదిలో వినియోగించే విద్యుత్‌తో పోల్చితే, బిట్‌కాయిన్ మైనింగ్‌కి వినియోగించే విద్యుతే ఎక్కువ. అంతేకాకుండా బిట్‌కాయిన్ మైనింగ్‌తో గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు కూడా పెరుగుతాయి. మైనింగ్‌కి ఉపయోగించిన తర్వాత కంప్యూటర్లు పనికి రాకుండా పోవడంతో, ఈ ప్రక్రియలో చాలా ఈ-వ్యర్థాలు కూడా ఉత్పత్తి అవుతున్నాయి.
బిట్‌కాయిన్ మైనింగ్‌కి వాడిన పరికరాల సగటు జీవితకాలం 1.29 సంవత్సరాలు మాత్రమే అని పరిశోధకులు అంచనా వేశారు. దీంతో, ఉత్పత్తి చేసిన ఈ-వ్యర్థాల మొత్తాన్ని నెదర్లాండ్స్ దేశంలో ఉత్పత్తి అయ్యే “ఐటీ, టెలికమ్యూనికేషన్ పరికరాల” వ్యర్థాలతో పోల్చవచ్చని పరిశోధకులు తెలిపారు. వీటిలో మొబైల్ ఫోన్‌లు, వ్యక్తిగత కంప్యూటర్లు, ప్రింటర్‌లు, టెలిఫోన్ వంటివి ఉన్నాయి. ఈ అధ్యయనాన్ని రిసోర్సెస్, కన్సర్వేషన్ అండ్ రిసైక్లింగ్ జర్నల్‌లో ప్రచురించారు.
బిట్‌కాయిన్ మైనర్‌లకు విద్యుత్ వినియోగం ప్రధాన ఖర్చు. కాబట్టి, దీన్ని వీలైనంత తగ్గించడానికి మరింత సమర్థవంతమైన ప్రాసెసర్‌లను వాడాలనుకుంటారు. దీంతో అప్లికేషన్-స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్(ఏఎస్‌ఐసీ) అని పిలిచే అత్యంత ప్రత్యేకమైన చిప్‌లను వినియోగించడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ ఏఎస్‌ఐసీలు చాలా ప్రత్యేకమైనవి. వాటిని వినియోగించిన తర్వాత “మరొక పనికి లేదా మరొక రకమైన క్రిప్టోకరెన్సీ మైనింగ్ అల్గారిథానికి తిరిగి ఉపయోగించలేం” అని పరిశోధకులు తెలిపారు. చిప్‌లను తిరిగి ఉపయోగించలేకపోయినా, బిట్‌కాయిన్ మైనింగ్ పరికరాల బరువులో ఎక్కువ భాగం రీసైకిల్ చేయగల “మెటల్ కేసింగ్‌లు, అల్యూమినియం హీట్-సింక్‌లు” వంటి భాగాలతో రూపొందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఈ-వ్యర్థాలలో దాదాపు 17 శాతం మాత్రమే రీ–సైకిల్ చేశారు. ఇక, బిట్‌కాయిన్ మైనర్లు ఎక్కువగా ఉండే కొన్ని దేశాల్లో ఈ సంఖ్య బహుశా మరింత తక్కువగా ఉంటుంది. ఈ దేశాల్లో చాలా సందర్భాలలో ఈ-వ్యర్థాలపై నిబంధనలు కూడా పేలవంగా ఉన్నాయి.