Home Mondo 42 సార్లు కరోనా బారిన పడిన వ్యక్తి.. ప్రపంచంలో ఇదే రికార్డు..!

42 సార్లు కరోనా బారిన పడిన వ్యక్తి.. ప్రపంచంలో ఇదే రికార్డు..!

0
42 సార్లు కరోనా బారిన పడిన వ్యక్తి.. ప్రపంచంలో ఇదే రికార్డు..!

కరోనా వచ్చిందంటే వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ ట్రీట్‌మెంట్ తీసుకుంటే పదిహేను రోజుల్లో కోలుకుంటారు. ఒక నెల రోజుల్లో సాధారణ జీవనాన్ని తిరిగి గడిపేస్తుంటారు. ఇంతకుముందులాగానే మునుపటి జోష్ కనిపిస్తుంది. కానీ ఓ వ్యక్తి మాత్రం మినహాయింపు అని చెప్పుకోవచ్చు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 310 రోజుల పాటు కరోనాతో పోరాడారు. పది నెలల పాటు కరోనా చికిత్సను తీసుకుంటూనే ఉన్నారు. 42 సార్లు ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఆయన మరణించడం ఖాయమనుకుని కుటుంబ సభ్యులు కూడా కొన్ని సార్లు అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు చేశారట. అయినా ఎట్టకేలకు ఆ కరోనా మహమ్మారిని జయించి కోలుకున్నారు. ప్రపంచంలోనే అరుదైన ఘటనగా రికార్డులకెక్కిన ఈ ఘటన యూకేలోని బ్రిస్టల్ ప్రాంతంలో జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

యూకేలోని బ్రిస్టల్ నగరానికి చెందిన డేవ్ స్మిత్‌ అనే 72 ఏళ్ల వ్యక్తి డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసి కొన్నేళ్ల క్రితం రిటైరయ్యారు. ఆయన ఎంతో కాలంగా ‘హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్’ అనే సమస్యతో బాధపడుతున్నారు. దీని వల్ల ఆయన శరీరంలో ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కొనే శక్తి చాలా తక్కువగా ఉంది. అందుకే కరోనా ఆయన్ను చాలా ఇబ్బందులకు గురి చేసింది. ఆయనకు 2019వ సంవత్సరంలోనే లుకేమియాకు కీమోథెరఫీ ట్రీట్‌మెంట్ జరిగింది. దీని వల్ల కూడా ఆయనలో ఇన్‌ఫెక్షన్లపై పోరాడే శక్తి తగ్గిపోయింది. 2020వ సంవత్సరం మార్చి నెలలో ఆయనకు మొదటి సారి కరోనా వైరస్ సోకింది. అయినా ఆయన దాన్ని గుర్తించలేకపోయారు. చివరకు ఆయన బాగా బలహీన పడిపోవడంతో పాటు ఆహార పదార్థాల వాసనను కూడా చూడలేకపోవడంతో ఏప్రిల్ నెలలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఛాతీలో నొప్పి రావడం వల్లనే తనను ఆస్పత్రికి తీసుకెళ్లారనీ, లేకుంటే ఇంట్లోనే ఉండి ట్రీట్‌మెంట్ తీసుకునేవాడినేమో అని డేవ్ స్మిత్ చెప్పుకొచ్చారు. కొన్ని వైద్య పరీక్షలు, కొద్ది రోజుల చికిత్స తర్వాత డేవ్ స్మిత్‌ను ఆస్పత్రి నుంచి ఇంటికి తిరిగి పంపించేశారు. అయినా ఆయన పరిస్థితి మెరుగవకపోవడంతో మళ్లీ జూలైలో ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. మళ్లీ కరోనా టెస్టులు నిర్వహిస్తే పాజిటివ్ అని తేలింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ కొవిడ్ వచ్చిందని మొదట వైద్యులు అపోహ పడ్డారు. కానీ ఆయనలో ఉన్న వైరస్ జన్యుక్రమాన్ని పరిశీలించినప్పుడు ఓ షాకింగ్ విషయాన్ని కనుగొన్నారు. గతంలో సోకిన వైరస్ ఆయన శరీరంలోంచి పూర్తిగా వెళ్లిపోలేదని వైరస్ జన్యుక్రమాన్ని పరిశీలించినప్పుడు తేలింది. ఆయన శరీరంలో ఉన్నది మృత కరోనా ఆర్ఎన్ఏ కాదనీ, సజీవ కరోనా వైరస్ అని తేల్చేశారు. దీంతో అప్పటి నుంచి ఆయనకు వైద్యులు ప్రత్యక్ష పర్యవేక్షణలో చికిత్సను ఇవ్వడం మొదలు పెట్టారు. 

ఆయనకు మొదటిసారి కరోనా సోకిన ఏడు నెలల తర్వాత వైద్యులు రెమ్‌డిసివీర్‌ను ఇవ్వడం మొదలు పెట్టారు. అయినప్పటికీ దానితో మెరుగైన ఫలితం కనిపించలేదు. దీంతో వైద్యులు కరోనా యాంటీబాడీలతో ప్రత్యేకంగా తయారు చేసిన ఔషధాలను డేవ్‌కు ఇచ్చారు. వాస్తవానికి ఇలాంటి చికిత్సకు బ్రిటన్‌లో అనుమతి లేదు. కానీ ప్రత్యేక పరిస్థితుల కారణంగా అక్కడి ప్రభుత్వం డేవ్‌ కేసు వరకే ఈ అనుమతిని ఇచ్చింది. దీంతో ఈ తరహా ట్రీట్‌మెంట్ వల్ల 45 రోజుల తర్వాత డేవ్ కరోనా నుంచి కోలుకున్నారు. ఆయన ట్రీట్‌మెంట్ జరుగుతున్న క్రమంలో మొత్తం మీద 42 సార్లు ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనాతో సుదీర్ఘ పోరాటం అనంతరం పది నెలల తర్వాత ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఆయన ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ‘నేను మా ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి నాపై ఆశలు వదులుకోండి. నేను ఇక తిరిగి రాను. అసలు కోలుకుంటానని నాపై నాకే నమ్మకం లేదు.’ అని డేవ్ చెప్పుకొచ్చారు. ఆయన చనిపోవడం ఖాయమని కుటుంబ సభ్యులు కూడా భావించి నాలుగైదు సార్లు అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లను చేసుకున్నారట. మొత్తానికి ప్రపంచంలోనే ఈ అరుదైన కేసుగా డేవ్ స్మిత్‌ నిలవడం గమనార్హం. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here