న్యూఢిల్లీ : ఈజిప్టులో తొలి మహిళా నౌకా కెప్టెన్‌గా రికార్డు సృష్టించిన మార్వా ఎల్సెలెహదార్ (29) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల సూయజ్ కాలువకు అడ్డంగా భారీ నౌక నిలిచిపోవడానికి కారణం తానేనని బూటకపు వార్తలు ప్రచారమవుతుండటం తనకు చాలా బాధ కలిగించిందని తెలిపారు. వాస్తవానికి ఎవర్ గివెన్ నౌక సూయజ్ కాలువలో చిక్కుకున్న సమయంలో తాను అక్కడికి వందలాది మైళ్ళ దూరంలో మెడిటెర్రేనియన్ పోర్ట్ సిటీ అలగ్జాండ్రియాలో విధి నిర్వహణలో ఉన్నానని తెలిపారు.
ఈజిప్టులో ఓ వార్తా సంస్థతో ఆమె మాట్లాడుతూ, ఎవర్ గివెన్ నౌక సూయజ్ కాలువలో చిక్కుకున్న సమయంలో తాను అక్కడికి వందలాది మైళ్ళ దూరంలో మెడిటెర్రేనియన్ పోర్ట్ సిటీ అలగ్జాండ్రియాలో విధి నిర్వహణలో ఉన్నానని తెలిపారు. నౌక నిలిచిపోవడానికి కారణం తానేనని బూటకపు వార్తలు ప్రచారమవుతుండటంతో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. తాను ఈ రంగంలో విజయవంతంగా రాణిస్తున్న మహిళనైనందుకు కానీ, తాను ఈజిప్షియన్‌నైనందుకు కానీ ఈ విధంగా తనను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేస్తున్నారని భావిస్తున్నానన్నారు. తనను లక్ష్యంగా చేసుకోవడానికి కారణాలేమిటో స్పష్టంగా తెలియదన్నారు.
మహిళలు తమ కుటుంబాలకు చాలా కాలంపాటు దూరంగా ఉంటూ సముద్రంలో పని చేయడాన్ని మన సమాజం ఇప్పటికీ అంగీకరించలేకపోతోందన్నారు. అయితే మనం ప్రేమించిన పని చేయడానికి ప్రతి ఒక్కరి అనుమతి తీసుకోవలసిన అవసరం లేదన్నారు. ఈ బూటకపు కథనం ఇంగ్లిష్‌లో ఉండటం వల్ల ఇతర దేశాల్లో కూడా ప్రచారమైందన్నారు. దీంతో తన పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగిందన్నారు. తాను కెప్టెన్ స్థాయికి చేరుకోవడం కోసం చాలా శ్రమించానని చెప్పారు. ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి తాను చాలా ప్రయత్నించానని తెలిపారు.
ఇదిలావుండగా, మార్చి 22న ఓ బూటకపు కథనం సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. ఓ బూటకపు వార్త హెడ్‌లైన్, మరొక వార్తా కథనం నుంచి తీసుకున్న మార్పులు చేసిన ఫొటోతో ఈ పుకార్లు మొదలయ్యాయి. సూయజ్ కాలువలో అడ్డంగా ఎవర్ గివెన్ నౌక నిలిచిపోవడానికి కారణం ఎల్సెలెహదార్ అని వదంతులు ప్రచారమయ్యాయి.